నవీన్ చంద్ర … భానుమతి రామకృష్ణ సినిమా రివ్యూ

Bhanumathi Ramakrishna Movie Review

లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతబడటంతో ఓటీటీకి ఆదరణ పెరిగింది. అందుకే కొన్ని కొత్త సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. 100 శాతం తెలుగు కంటెంట్‌‌ను అందిస్తోన్న ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫాంలో శుక్రవారం (జూలై 3న) ‘భానుమతి & రామకృష్ణ’ సినిమా విడుదలైంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

తెలుగు ప్రేక్షకులకు ప్రేమకథలు కొత్తేమీకాదు. ఇప్పటికే చాలా రకాల ప్రేమకథలను వెండితెరపై చూశారు. ఇది కూడా అలాంటి ఒక ప్రేమకథే. కాకపోతే, ఇది కాస్త ముదురు ప్రేమ. భిన్న మనస్తత్వాలు కలిగిన ఓ 30 ఏళ్ల అమ్మాయి, 33 ఏళ్ల అబ్బాయి మధ్య ప్రేమ చిగురించినప్పుడు ఆ సంఘర్షణను వారు ఎలా ఎదుర్కొన్నారు అనే విషయాన్ని దర్శకుడు ఆవిష్కరించారు. సినిమా నిడివి తక్కువగా ఉండటం వల్ల ఎక్కడా బోర్ ఫీలింగ్ కలగదు. సినిమా అలా సాగిపోతూ ఉంటుంది.

భానుమతి ఫారన్‌లో చదువుకున్న అమ్మాయి, మోడరన్‌గా ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఎప్పుడూ చాలా సీరియస్‌గా ఉంటుంది. రామకృష్ణ ఓ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు. కల్మషం లేని మనిషి. అందరితో ఇట్టే కలిసిపోతాడు. అలాంటి వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనే విషయాన్ని దర్శకుడు చాలా అందంగా చూపించారు. చిన్న చిన్న భావోద్వేగాలతో కథను నడిపించారు. కథనం చాలా నిదానంగా సాగుతుంది. ఎలాంటి ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఉండవు. అలాగే డూయెట్‌లు కూడా లేవు. మధ్య మధ్యలో హర్ష కామెడీ కాస్త వినోదాన్ని పంచుతుంది.

సినిమాకు ప్రధాన బలం నవీన్ చంద్ర, సలోనీ లూత్రా. రామకృష్ణ పాత్రలో నవీన్ చంద్ర జీవించారు. ఇప్పటి వరకు కనిపించని పాత్రలో ఆయన ఈ సినిమాలో కనిపించారు. పల్లెటూరులో డిగ్రీ వరకు చదువుకున్న కుర్రాడు ఎలా ఉంటాడో రామకృష్ణ పాత్ర అలానే ఉంటుంది. చాలా మందికి తమను తాము చూసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో నవీన్ చంద్ర నటన చాలా బాగుంది. కొత్తగా ఉంది.

ఇక మోడరన్ అమ్మాయి పాత్రలో సలోని చక్కగా నటించారు. లేడీ బాస్‌గా బయటికి సీరియస్‌గా కనిపించినా లోపల చిన్న పిల్ల మనస్తత్వం కలిగిన అమ్మాయి పాత్రలో ఆమె ఒదిగిపోయారు. ఇక హర్ష తన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. సీరియస్‌గా సాగే కథలో హర్ష కామెడీ కాస్త ఉపసమనాన్ని ఇస్తుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు.

టెక్నికల్‌గా సినిమా చాలా క్వాలిటీగా ఉంది. తక్కువ లొకేషన్లలో చాలా సింపుల్‌గా తీసేశారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రవణ్ భరద్వాజ్ స్వరపరిచిన పాటలు బాగున్నాయి. కథతో పాటే సాగిపోతాయి. అచ్చు రాజమణి నేపథ్య సంగీతం మరో బలం. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ దర్శకుడు రవికాంత్ పెరెపు ఈ సినిమా బాగా ఎడిట్ చేశారు. చాలా సింపుల్‌గా క్రిస్పీగా కట్ చేశారు.

Bhanumathi Ramakrishna Movie Review

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *