సురేష్ రైనా కుటుంబం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు

Suresh Raina Complaints about a Case

భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఫిర్యాదుపై పంజాబ్ పోలీసులు స్పందించారు. ఇటీవల పఠాన్‌కోట్‌లోని సురేశ్ రైనా మేనత్త ఇంటిపై దాడి చేసిన దుండగులు.. ఆమె భర్తని హత్య చేశారు. ఈ దాడిలో అతని మేనత్త, ఆమె కొడుకుకి కూడా తీవ్ర గాయాలవగా.. సోమవారం రాత్రి ఆ కొడుకు కూడా చనిపోయారు. దాంతో.. సోషల్ మీడియాలో ఆ దాడిపై సురేశ్ రైనా ఘాటుగా స్పందిస్తూ.. ప్రశ్నల వర్షం కురిపించాడు. ఐపీఎల్ 2020 సీజన్ నుంచి తప్పుకున్న సురేశ్ రైనా ఇటీవల యూఏఈ నుంచి భారత్‌కి వచ్చేసిన విషయం తెలిసిందే.

‘‘ఆరోజు రాత్రి ఏం జరిగిందో..? ఈరోజుకి కూడా మాకు స్పష్టంగా తెలియడం లేదు. పంజాబ్ పోలీసులు ఈ కేసుపై విచారణ జరిపాలి. ఆ దాడి ఎవరు చేశారో..? తెలుసుకునే హక్కు మాకుంది. ఆ దుండగులు ఇలాంటి దాడులు ఎక్కడా చేయకుండా చర్యలు తీసుకోవాలి’’ అని పంజాబ్ పోలీస్ విభాగం, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్‌కి రైనా ట్యాగ్ చేశాడు. దాంతో.. రైనా ట్వీట్‌పై వెంటనే ఎస్పీ ప్రభజ్యోత్ సింగ్ స్పందించారు.

రైనా మేనత్త ఇంటిపై దాడికి పాల్పడిన దుండగుల్ని పట్టుకునేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన ఎస్పీ.. వాళ్లు ఇప్పటికే విచారణ ప్రారంభించినట్లు తెలియజేశారు. ఘటన తర్వాత కొన్ని చోట్ల రైడ్‌ కూడా నిర్వహించి సమాచారం సేకరించినట్లు వివరించిన ఎస్పీ.. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని కూడా హామీ ఇచ్చారు. ఐపీఎల్ నుంచి రైనా నిష్క్రమించడానికి ఈ దుండగుల దాడి కారణమని వార్తలు వస్తుండగా.. రైనా మాత్రం ఐపీఎల్ నుంచి తప్పుకోవడంపై స్పందించడం లేదు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *