చైనా తోక వంకర, మరో సారి కవ్వింపు చేర్యాలకు దిగిన డ్రాగన్ దేశం

China Trying to provoke India at Border

తూర్పు లడఖ్ సరిహద్దుల్లో చైనా దుందుడుకు వైఖరి రోజురోజుకూ పెరిగిపోతోంది. తాము ఉల్లంఘనలకు పాల్పడినా భారత్ ఎదురు ప్రశ్న వేయరాదనే ధోరణిని ప్రదర్శిస్తోంది. అయితే, ఈ బెదిరింపులకు భారత్ బెదరకుండా ఎదురు నిలవడంతో డ్రాగన్ పరిస్థితి కాలుగాలిన పిల్లి మాదిరిగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రశాంతంగా ఉన్న వాస్తవాధీన రేఖను యుద్ధ రంగంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనివిధంగా దాదాపు 45ఏళ్ల తర్వాత సోమవారం రాత్రి తుపాకుల గర్జించడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

వాస్తవాధీన రేఖ వెంబడి ఆయుధాలను వాడకూడదనే ఒప్పందాన్ని ఉల్లంఘించి వివాదాన్ని మరో స్థానానికి తీసుకెళ్లింది. సరిహద్దుల్లో చివరిసారిగా తుపాకులను డ్రాగన్ సైనికులే వినియోగించారు. 1975లో సీపీఎల్‌ఏకు చెందిన కొందరు సైనికులు తులుంగ్‌ లా వద్ద భారత భూభాగంలోకి చొరబడి… అక్కడ విధులు నిర్వర్తిస్తోన్న అస్సాం రైఫిల్స్‌ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత భారత్‌-చైనాల సరిహద్దు వద్ద శాంతిని పునరుద్ధరించడానికి అనేక ఒప్పందాలు జరిగాయి. ఇందులో ఒకటి 1996 నాటి నిరాయుధీకరణ ఒప్పందం.

వాస్తవాధీన రేఖకు రెండు కిలోమీటర్ల వరకు జీవ, రసాయన ఆయుధాల వినియోగం, పేలుడు కార్యకలాపాలు, తుపాకులతో లేదా పేలుళ్ల సాయంతో వేటాడం నిషేధం. చిన్న ఫైరింగ్‌ రేంజిల్లో మాత్రం సైన్యం జరిపే రొటీన్‌ కాల్పులను సాధన చేసుకోవచ్చు. తాజాగా సోమవారం పాంగాంగ్‌ సరస్సు వద్ద జరిగిన ఘటన ఈ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఇక, సరిహద్దుల వెంట కాల్పులు జరిగాయని తొలుత చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ప్రకటించింది. భారత సైన్యం వాస్తవాధీన రేఖను దాటి తమ జవాన్ల వద్దకు వచ్చి కాల్పులకు జరపడంతో సీపీఎల్ఏ చర్యలు చేపట్టిందని పేర్కొంది.

అయితే, పీఎల్‌ఏ సైనికులు కాల్పులు జరిపారని.. తమ‌ దళాలు పరిణతితో శాంతిని కాపాడేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించాయని భారత‌ సైన్యం పేర్కొంది. అంతేగానీ బదులిచ్చే చర్యలు చేపట్టినట్లు ఎక్కడా తెలియజేయలేదు. ఒకవేళ, భారత సైన్యం కాల్పులు జరిపితే కనీసం ప్రతి చర్యగా జరిపామని అయినా చెబుతుంది. ఈ ప్రకటనలో ఎక్కడా అటువంటివి పేర్కొనలేదంటే చైనా వైపు నుంచి కాల్పులు జరిగాయనే అర్థం. తప్పును భారత్‌పై నెట్టేందుకు గ్లోబల్‌ టైమ్స్‌ తొలుత వార్తను ప్రచురించింది. కీలక శిఖరాలను భారత్‌ నుంచి స్వాధీనం చేసుకోవడానికి చైనా చేసిన విఫలయత్నంగా ఇది మిగిలిపోయింది.

సరిహద్దు వెంట చైనా ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తన ప్రతిష్ట మసక బారిందనే భావనతో ప్రతీకార చర్యలకు దిగుతోంది. ఇందులో భాగంగా మరోసారి గల్వాన్ తరహా కుట్రకు తెరతీసింది. రాడ్లు, ఇనుప ముళ్లు కలిగిన ఆయుధాలు, పదునైన ఆయుధాలతో భారత జవాన్లపై పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దాడికి ప్రయత్నించింది. మన సైనికులను రెచ్చగొట్టింది. కానీ, భారత వీరులు మాత్రం చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో పెట్టని గోడలా నిల్చున్నారు. అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారు. లడఖ్‌లోని ముఖ్‌పారి ప్రాంతంలో సోమవారం (సెప్టెంబర్ 7) సాయంత్రం చోటు చేసుకున్న ఉద్రిక్తతల గురించి ఇండియన్ ఆర్మీ వర్గాలు మంగళవారం కీలక వివరాలు తెలిపాయి.

ఇలాగైనా భయపడకపోతారా అని చైనా సైనికులు ఆయుధాలను తీసి గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా మన జవాన్లు అదరలేదు, బెదరలేదు. అలాగని.. ప్రతిగా కాల్పులు కూడా జరపలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కంటి చూపుతోనే శత్రువును చంపినంత పనిచేశారు. దీంతో చేసేదేంలేక చైనా సైన్యం తోకముడిచింది.

సోమవారం సాయంత్రం 6 గంటలకు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) జవాన్లు పదునైన ఆయుధాలతో తూర్పు లడఖ్‌లోని ముఖ్‌పారి సమీపంలో పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో ఉన్న ఇండియన్ ఆర్మీ స్థావరం వద్దకు వచ్చారు. సరిహద్దును దాటి ముందుకు రావడానికి ప్రయత్నించారు. సుమారు 50 నుంచి 60 మంది సైనికులు పదునైన ఆయుధాలతో అక్కడికి వచ్చినట్లు ఇండియన్ ఆర్మీ వర్గాల ద్వారా తెలిసింది.

అయితే.. పీఎల్ఏ సైనికులను భారత బలగాలు దీటుగా ఎదుర్కొన్నాయి. శత్రు సైన్యం వద్ద పదునైన ఆయుధాలు ఉన్నా.. భారత జవాన్లు ఖాళీ చేతులతోనే వారికి అడ్డుగోడగా నిల్చున్నారు. అక్కడ నుంచి వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు. మరోసారి గల్వాన్ తరహా వీరత్వాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో చైనా ఆర్మీ గాల్లోకి సుమారు 10 నుంచి 15 రౌండ్ల కాల్పులు జరిపిందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ మన జవాన్లు వెనుకడుగు వేయకపోవడంతో వాళ్లు రాళ్ల దాడికి దిగినట్లు తెలిపారు.

భారత జవాన్ల ధైర్య, సాహసాలను చూసి చైనా ఆర్మీ చివరికి తోక ముడిచింది. ఎలాగైన పైచేయి సాధించాలనే కసితో వచ్చిన వాళ్లకు మరోసారి పరాభవమే మిగిలింది. దీంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. దీంతోపాటు రెండు రోజుల కిందట భారత జవాన్లు కీలకమైన ముఖ్‌పారీ శిఖరంపై పట్టు సాధించడాన్ని డ్రాగన్ తట్టుకులేకపోతోంది. చైనా ఆర్మీ చేతిలో ప్రమాదకర గౌండావ్ ఆయుధం..

చైనా ఆర్మీ తీసుకొచ్చిన ఆయుధాల్లో ‘గౌండావ్’ అనే సంప్రదాయ ఆయుధం కూడా ఉందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. చైనాలో మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వాళ్లు ఈ ఆయుధాన్ని వాడుతారని వెల్లడించాయి. మరోవైపు చైనా ఆర్మీ.. ప్రపంచానికి అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. భారత జవాన్లే నిబంధనలను ఉల్లంఘించారని, సరిహద్దును దాటి తమ భూభాగంలోకి ప్రవేశించారని ఆరోపిస్తోంది. కాల్పులు జరుపుతూ హెచ్చరికలు చేశారని చెబుతోంది.

చైనా ఆర్మీ ఆరోపణలను ఇండియన్ ఆర్మీ ఖండించింది. చైనా జవాన్లు కవ్వింపు చర్యలకు పాల్పడినా.. భారత జవాన్లు సంయమనంతో, విజ్ఞతతో వ్యవహరించారని తెలిపింది. ఇందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. చైనా సైనికులు పదునైన ఆయుధాలతో భారత ఆర్మీ స్థావరం వద్దకు వచ్చిన దృశ్యాలకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది. భారత జవాన్లు మానవహారంగా ఏర్పడి చైనా సైనికులకు అడ్డుగోడగా నిలిచిన దృశ్యాలు ఆ ఫోటోల్లో కనిపిస్తున్నాయి.

గల్వాన్ లోయలో జూన్ 15న రాత్రి జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోశ్ బాబు సహా 20 మంది జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు కూడా భారీగా నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నా.. డ్రాగన్ మాత్రం ఆ లెక్కలను బయటపడనివ్వకుండా జాగ్రత్త పడుతోంది. ఒకరకంగా తమ సైనికుల త్యాగాలను అవమానపరుస్తోంది. దీనిపై స్థానికంగానూ విమర్శలు వస్తున్నాయి. అటు అంతర్జాతీయంగానూ ప్రతిష్ట మసకబారడంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతోంది. చైనా సరిహద్దు వెంట కాల్పుల మోత వినిపించడం 45 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 1975లో చైనా బలగాలు సరిహద్దు వెంట కాల్పులకు పాల్పడ్డాయి.

China Trying to provoke India at Border

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *