శ్రీవారి బ్రహ్మోత్సవ అలంకరణకు గద్వాల ఏరువాడ పంచెలు

తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామికి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా పంపించే గద్వాల ఏరువాడ జోడు పంచెలు సిద్ధమయ్యాయి. తెలంగాణాప్రాంతంలోని మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి చేనేత ఏరువాడ జోడుపంచెలు సమర్పించటం సంప్రదాయం. గత 400 సంవత్సరాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. ఈసారి చేపట్టిన శ్రీవారి జోడు పంచెల నేత ఇటీవలే పూర్తయింది. ఐదుగురు చేనేత కార్మికులు 41 రోజులు నిష్టతో వీటిని తయారుచేశారు. ఏరు అంటే నదీపరివాహక ప్రాంతం అని అర్థం. మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల్ నగరం పవిత్రమైన తుంగభద్ర, కృష్ణానది మధ్య ఉంది. ఈ రెండు నదుల మధ్య ఉండే ఈ ప్రాంతంలో చేనేత మగ్గాలపై జోడుపంచెలు తయారు చేయటం సంప్రదాయం. అందుకే ఈ పంచెలు ఏరువాడ జోడు పంచెలుగా ప్రసిద్ధి కెక్కాయి. గద్వాల సంస్థానాధీశులలో ఒకరైన సీతారాంభూపాల్ తన ఇష్టదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఏరువాడ జోడు పంచెలు సమర్పించటం సంప్రదాయం. అదే సంప్రదాయం వారి వంశీయులు కొనసాగిస్తున్నారు.సాక్షాత్తు కలియుగ దేవదేవునికి అలంకరించే వ స్త్రాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక మగ్గంతో 41 రోజుల పాటు దీక్షతో ఈ జోడు పంచెలు తయారు చేస్తారు.

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలు..బ్రహ్మాండనాయకునికి హంసవాహన సేవ

గద్వాల ఏరువాడ పంచె 11 గజాల పొడవు, రెండున్నర గజాల వెడల్పు ఉంటుంది. 15 అంగుళాల వెడల్పు అంచుతో పంచెలపై రాజకట్టడాల గుర్తుగా ఎనిమిది కోటకొమ్మ అంచులతో కళాత్మకంగా తయారు చేస్తారు. ఒక్కోపంచెను తయారు చేయడానికి 20 రోజులు పడుతుంది.గద్వాల సంస్థానం నుండి అందిన ఈ పంచెలను ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు అలంకరిస్తారు. అలా స్వామివారికి అలంకరించిన వాటిలో ఓ పంచెను శేషవస్త్రంగానూ, శ్రీవారి ప్రసాదాలను కానుకగా గద్వాల సంస్థానానికి పంపటం తిరుమల ఆలయ సంప్రదాయం. అక్టోబర్‌ 7 నుంచి 15వ తేదీ వరకు జరిగే దసరా బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు శ్రీవారి అలంకరణలో జోడు పంచెలను ధరింపజేస్తారు. ఈ పంచెలను టీటీడీ అధికారులకు అందజేయనున్నట్లు తయారీని పర్యవేక్షించిన మహం కాళి కరుణాకర్‌ పేర్కొన్నారు.గద్వాల సంస్థానాధీశులు సీతారాంభూపాల్ తన ఇష్టదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఏరువాడ జోడు పంచెలు సమర్పించటం ఆనవాయితీ. అదే సంప్రదాయం వారి వంశీయులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుత గద్వాల్ సంస్థానం వారసురాలిగా ఉన్న శ్రీలతాభూపాల్‌ ఆధ్వర్యంలో జోడు పంచెలను శ్రీవారికి పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *