ఆర్మీ విచారణలో కీలక విషయాలను వెల్లడించిన పాకిస్థాన్ తీవ్రవాది

జమ్మూకశ్మీర్ లోని యూరి సెక్టార్ లో ఇటీవల పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాది అలీ బాబర్ భారత సైన్యానికి పట్టుబడిన సంగతి తెలిసిందే. పాక్ ఉగ్రవాది సజీవంగా పట్టుబడటం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారి. అలీ బాబర్ ను ఆర్మీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో పాక్ ఉగ్రవాది పలు విషయాలను వెల్లడించాడు.తనకు పాకిస్థాన్ ఆర్మీ, లష్కరే తాయిబా ఉగ్రసంస్థలు శిక్షణ ఇచ్చాయని తెలిపాడు. బారాముల్లాలో ఒక ప్రాంతానికి ఆయుధాలను చేరవేసేందుకు రూ. 20 వేలు ఇచ్చారని చెప్పాడు. తమది పేద కుటుంబమని, తనకు తండ్రి లేడని, వస్త్ర పరిశ్రమలో పని చేసేవాడినని తెలిపాడు. ఆ సమయంలో ఐఎస్ఐతో సంబంధం ఉన్న ఓ కుర్రాడితో తనకు పరిచయం ఏర్పడిందని… డబ్బుకు ఆశపడి అతనితో కలిసి లష్కరే తాయిబాలో చేరానని చెప్పాడు.ముజఫరాబాద్ లోని లష్కరే క్యాంపులో శిక్షణ ఇచ్చారని… శిక్షణ సమయంలో తనకు రూ. 20 వేలు ఇచ్చారని, శిక్షణ తర్వాత రూ. 30 వేలు ఇస్తామన్నారని తెలిపాడు. శిక్షణ పూర్తయిన తర్వాత తనను పాక్ సైన్యం వద్దకు తీసుకెళ్లారని చెప్పాడు. వారి ఆదేశాల మేరకు తాను, మరి కొందరు భారత్ లో చొరబడేందుకు యత్నించామని తెలిపాడు.మరోవైపు ప్రస్తుతం కశ్మీర్ లోయలో 70 మంది వరకు పాక్ ఉగ్రవాదులు ఉండొచ్చని ఆర్మీ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వీరు నేరుగా దాడుల్లో పాల్గొనకుండా.. స్థానికంగా ఉన్నవారిని రెచ్చగొట్టి, దాడుల్లో పాల్గొనేలా వ్యూహాలు అమలు చేస్తారని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *